ఈ దేశం గ‌ర్వించ‌ద‌గిన వ్య‌వ‌సాయ శాస్త్ర‌వేత్త‌ల‌లో సుభాష్ పాలేక‌ర్ ఒక‌రు. ఎలాంటి పెట్టుబడులు లేకుండా ..ర‌సాయ‌నాలు, మందులు వినియోగించ‌కుండా వ్య‌వ‌సాయం ఎలా సాగు చేయ‌వ‌చ్చో ..ఆత్మ‌హ‌త్య‌ల నుండి కాపాడు కోవ‌చ్చో పాలేక‌ర్ గ‌త కొన్నేళ్లుగా దేశ‌మంత‌టా ప‌ర్య‌టిస్తున్నారు. ప్ర‌కృతి వ్య‌వ‌సాయం సాగుపై రైతుల‌కు స‌మావేశాలు, అవ‌గాహ‌న స‌ద‌స్సులు చేపడుతూ రైతుల్లో ఆత్మ‌విశ్వాసాన్ని నింపుతున్నారు. ప్ర‌త్యేకంగా ఎలా సాగు చేయ‌వ‌చ్చో ద‌గ్గ‌రుండి చూపిస్తున్నారు. ఇందుకోసం సేవ్‌సంస్థ మ‌రికొంత మంది రైతుల‌కు చేర‌వేసేలా శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేసింది. మే 13 నుండి 21 వ‌ర‌కు అంటే దాదాపు 8 రోజుల పాటు ఎంపిక చేసిన రైతుల‌కు పెద్ద ఎత్తున శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు, భ‌క్తులు, అనుచ‌రుల‌ను క‌లిగి ఉన్న శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి చిన‌జీయ‌ర్ స్వామీజీ మంగ‌ళాశాస‌నాల‌తో ఈ అరుదైన కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. శంషాబాద్ మండ‌లం ముచ్చింతల్ లోని దివ్య సాకేతం ఆశ్ర‌మంలోనే ఈ శిక్ష‌ణ కొన‌సాగుతుంది. స్థ‌లాన్ని , సౌక‌ర్యాల‌ను స్వామీజీ అనుగ్ర‌హంతో ఇవ్వ‌గా మిగ‌తా ఏర్పాట్ల‌ను సేవ్ మ‌రికొన్ని సంస్థ‌ల‌తో క‌లిసి ప్ర‌కృతి వ్య‌వ‌సాయం సాగుపై రైతుల‌కు త‌ర్ఫీదు ఇవ్వ‌నుంది. క‌ఠిన‌మైన నియ‌మ నిబంధ‌న‌లు విధించారు. ప్ర‌త్యేకించి భార్య‌, భ‌ర్త లేదా తండ్రీ, కొడుకు, ఇలా రావాల్సి ఉంటుంది. ఇప్ప‌టికే 80 శాతం మంది కేవ‌లం 38 ఏళ్ల లోపు వారు తాము శిక్ష‌ణ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని త‌మ పేర్ల‌ను నిర్వాహ‌కుల‌కు అంద‌జేశారు. అంటే ఈ కార్య‌క్ర‌మానికి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఉచిత వ‌స‌తి, భోజ‌న ఏర్పాట్ల‌ను ఇప్ప‌టికే పూర్తి చేశారు. ఎలాంటి ఇబ్బందులు ప‌డ‌కుండా ఉండేలా చేశారు. నీటి ఎద్ద‌డి లేకుండా ఉండేందుకు రైతులకు 24 గంట‌ల పాటు నీటి వ‌స‌తిని మై హోం సంస్థ ఏర్పాటు చేస్తోంది. మిగ‌తా సౌక‌ర్యాల‌ను స్వామీజీ ఆశీస్సుల‌తో నిర్వాహ‌కులు చేస్తున్నారు. ఇక్కడికి వ‌చ్చే రైతులు శిక్ష‌ణ స‌మ‌యంలో ఎలాంటి సెల్‌ఫోన్లు వాడ‌రు. ఉద‌యం 8.30 గంట‌ల‌కు ప్రారంభ‌మ‌వుతుంది. రాత్రి 8.30 గంట‌ల దాకా కొన‌సాగుతుంది. ప్ర‌తి రోజు సుభాష్ పాలేక‌ర్ ఆధ్వ‌ర్యంలో శిక్ష‌ణ త‌ర‌గ‌తులు ఉంటాయి. పాల్గొనే రైతులు అడిగే సందేహాల‌ను పాలేక‌ర్‌తో పాటు నిర్వాహ‌కులు విజ‌య్ రామ్ , త‌దిత‌రులు తీరుస్తారు. అంతేకాకుండా ప్ర‌కృతి వ్య‌వ‌సాయం సాగు చేస్తూ అధిక దిగుబ‌డి సాధిస్తున్న రైతులు త‌మ అనుభ‌వాల‌ను, విజ‌య గాధ‌ల‌ను శిక్ష‌ణ సంద‌ర్భంగా రైతుల‌కు వివ‌రిస్తారు. దీని వ‌ల్ల వారు నేర్చు కోగ‌లుగుతారు. ఇత‌రుల‌కు నేర్ప‌గ‌ల‌రు కూడా..ఈ శిక్ష‌ణ అనంత‌రం జూనియ‌ర్ పాలేక‌ర్లుగా వీరిని తీర్చిదిద్దుతారు. వీరంతా జిల్లా, నియోజ‌క‌వ‌ర్గ‌, మండ‌ల‌, గ్రామ స్థాయిల‌లో ఇలాంటి స‌ద‌స్సులు, స‌మావేశాలు ఏర్పాటుచేసి అవ‌గాహ‌న క‌ల్పిస్తారు. అంతేకాకుండా త‌మ‌కు అందుబాటులో ఉన్న విత్త‌నాల‌తో పాటు సేవ్ సంస్థ ఇచ్చే విత్త‌నాల‌తో విత్త‌నాల కేంద్రాల‌ను ఏర్పాటు చేసేలా చేస్తారు. పూర్తిగా వ్య‌వ‌సాయ క్షేత్రంలో త‌యారైన , పండించిన విత్త‌నాల‌ను రైతుల‌కు ఉచితంగా అంద‌జేస్తారు. అంతేకాకుండా వాటి ద్వారా దేశీయ విత్త‌నాలు, ఆవుల పాలు, పెరుగుతో భోజ‌నాలు వ‌డ్డించ‌నుండ‌డం ఈ శిక్ష‌ణ ప్ర‌త్యేక‌త‌. మొద‌టి రోజు ఈ శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని చిన‌జీయ‌ర్ స్వాముల వారు ప్రారంభిస్తారు. పెద్ద ఎత్తున ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా అన్ని ఏర్పాట్లు చేయ‌డంలో అటు నిర్వాహ‌కులు ఇటు ఆశ్ర‌మ బాధ్యులు చూస్తుండ‌డం విశేషం.