ఆళ్వారులు, ఆచార్యులు మ‌నంద‌రికి మార్గ‌ద‌ర్శ‌కులు – శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి చిన్న‌జీయ‌ర్ స్వామి
———————————————————————————————-
ఆళ్వారులు, ఆచార్యులు మ‌నంద‌రికి మార్గ‌ద‌ర్శ‌కుల‌ని శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి చిన్న‌జీయ‌ర్ స్వామి వారు అన్నారు. చాతుర్మాస్య దీక్ష సంద‌ర్భంగా దివ్య సాకేత క్షేత్రంలో రెండవ రోజు సోమ‌వారం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో భ‌క్తుల‌ను ఉద్ధేశించి ప్ర‌సంగించారు. 12 మంది ఆళ్వారులున్నారు. చాలా మంది ఆచార్యులున్నారు. ఆళ్వార్ల‌ను దివ్యసూరులు అని కూడా అంటారు. బాగా పోషింప‌బ‌డిన వ్య‌క్తిని సూరి అంటారు . దివ్య‌సూరులు అంటే. భ‌గ‌వ‌త్ త‌త్వంతో బాగా పోష‌ణ పొందిన వార‌ని అర్థం. భ‌గ‌వంతుడిది దివ్య‌మైన త‌త్వం. ఎవ‌రైతే పై లోకంలో ఉన్నారో వారిని దివ్య‌త‌త్వ‌మ్ అంటారు. వాటిని చూసేందుకు దివ్య‌మైన చ‌క్షువులు (క‌ళ్లు) కావాలి. దివ్య సూరి అనేది సంస్కృత ప‌దం. ఇంకో అర్థం దివ్య‌ణి. ఈ త‌త్వం అంత‌టా వుంది. మ‌న‌లో వున్న‌ది..మ‌న మ‌ధ్య‌లో వున్న‌ది. వేదాలు కూడా ఈ త‌త్వాన్ని నిర్వచించ‌లేక పోయాయి. ప్ర‌య‌త్నం చేశాయి కానీ చెప్ప‌లేక ఆగిపోయాయి. ఈ త‌త్వాన్ని ఆళ్వార్లు అనుభ‌వించారు. అందులో లోతుల్లోకి వెళ్లిపోయారు. త‌మ అనుభూతిని , అనుభ‌వాల‌ను అందించారు కాబ‌ట్టే వాళ్లు ఆళ్వార్లు అయ్యారు.

ఆళ్వార్లు అంటే అర్థం ఏమిటి. అంద‌రిని ర‌క్షించే వాళ్ల‌ను ఆళ్వార్లు అంటారు. అళుఘై అనే ధాతువు నుండి వ‌చ్చిన ప‌ద‌మే ఆళ్వార్‌. ఎవ‌రిని రక్షించారు .. జీవాత్మ‌ను , ప‌ర‌మాత్మ‌ల‌ను ర‌క్షించారు ఆళ్వార్లు. దేవుడిని ర‌క్షించ‌డ‌మేమిటి, ప‌ర‌మాత్ముడిని కాపాడ‌టం ఏమిటి. అస‌లు ర‌క్ష‌ణ అంటే ఏమిటి.

ర‌క్ష‌ణ అంటే ఇష్టాన్ని ద‌గ్గ‌ర చేయ‌టం. అనిష్టాన్ని దూరం చేయటం. ఈ జీవులంద‌రు కూడా క‌ర్మ‌బంధం తొల‌గించుకుని ప‌ర‌మ‌ప‌దంలో నిత్యుల‌తో పాటు కైంక‌ర్యంలో పాల్గొన‌డం ప‌ర‌మాత్మ‌కు ఇష్టం. ప‌ర‌మాత్మ అనుగ్ర‌హిస్తున్నా వినిపించుకోకుండా జీవులు కొట్టుకుంటూ ఇక్క‌డే ఉండి పోవ‌డం అనిష్ట‌మైన‌ది. ఆళ్వార్లు ప‌ర‌మాత్మ‌కు ప్రీతి క‌లిగించేట‌ట్టు వారు అనుగ్ర‌హానికి అడ్డు గోడ వేయ‌లేదు. పూర్తిగా స్వీక‌రించారు కాబ‌ట్టి ప‌ర‌మాత్ముడికి ర‌క్ష‌కుల‌య్యారు. ఆళ్వార్ అన్న ప‌దానికి రెండ‌ర్థాలున్నాయి. ఒక‌టి ప‌ర‌మాత్మ త‌త్వంలో మునిగి పోయి అనుభ‌వించి ఆనందాన్ని లోకానికి అందించ‌డం. రెండోది జీవుల‌ను ర‌క్షించ‌డం. ఆళ్వార్ల‌కున్న ప్ర‌త్యేక‌త ఏమిటి. ఆళ్వార్ల‌కు భ‌గ‌వంతుడే స్వ‌యంగా జ్ఞానాన్ని ఇచ్చాడు. మామూలుగా జ్ఞానం పొందాలంటే లేదా అనుభ‌వంలోకి రావాలంటే ఒక గురువు ద్వారానో లేదా ఆచార్యుల ద్వారానో లేదా గ్రంధాల‌ను అధ్య‌య‌నం చేస్తేనో జ్ఞానం ల‌భిస్తుంది. కానీ ఆళ్వార్ల‌కు ఎలాంటి కృషి చేయ‌కుండానే ప‌రమాత్మ జ్ఞానాన్ని స్వ‌యంగా ఇచ్చాడు ప‌ర‌మాత్మ‌..

అందులో 12 మంది ఆళ్వార్లు ఉన్నారు. న‌మ్మాళ్వార్లు వారంద‌రికీ మూల‌కందం. . న‌మ్మాళ్వార్ క‌లియుగం ప్రారంభ‌మైన 40వ రోజు జ‌న్మించారు. వారి కంటే ముందు 5 గురు ఆళ్వార్లు పుట్టారు. పోయిఘై, పేయ్‌, పూద‌త్త, తిరుమ‌జిశై మ‌రియు మ‌ధుర‌క‌వి. ఈ అయిదుగురు న‌మ్మాళ్వార్ కంటే ముందు జ‌న్మించారు. వారి త‌ర్వాతి కాలంలో మ‌రో 7 మంది ఆళ్వార్లు జ‌న్మించారు.

ప‌మ్మాళ్వార్ల‌ను ఆళ్వార్లంద‌రికి శ‌రీరి అని, అవ‌య‌వి అని కూడా అంటారు. దివ్య ప్ర‌బంధం చాలా శ‌క్తివంత‌మైన‌ది. ఆరోజుల్లో ఈ ప్ర‌బంధాన్ని పారాయ‌ణం చేసిన వెంట‌నే మోక్షం ల‌భించేది. ఎంద‌రినో నాశ‌నం చేస్తుంద‌నే కోపంతో దివ్య ప్ర‌బంధాన్ని కాల్చేసి క‌నిపించ‌కుండా చేసేశారు. కొన్నాళ్ల‌కు ప్ర‌బంధం క‌లియుగ ప్రారంభం నుండి 8వ శ‌తాబ్ధం వ‌ర‌కు మాన‌వ జాతికి దూర‌మై పోయింది.

నాథ‌మునులు గొప్ప ఆచార్యులు. ద‌క్షిణ ప్రాంత‌మంతా విస్తృతంగా ప‌ర్య‌టించారు. కుంభ‌కోణం అనే ఊరిలో శ్రీ‌రామ సారంగ‌పాణి పెరుమాళ్ల‌ను సేవించుకునేందుకు వెళ్లారు. అక్క‌డ ఆరా అముదే అనే దివ్య‌మైన గానాన్ని విన్నారు. అతృప్త అమృత‌మా అని భ‌గ‌వంతుడిని సంబోధించే పాట‌లో ఉన్న‌ది. ఇంత‌వ‌ర‌కు ప‌ర‌మాత్ముడి గురించి అలా హృద్యంగా పాడ‌లేదు. వేదాలు కూడా భ‌గ‌వంతుడిని అమృత‌స్య పుత్ర అని పిలిచాయి. అమృత స్వ‌రం క‌ల‌వాడా అని అర్థం. ప్ర‌బంధంలో భ‌గ‌వంతుడిని అమృతం కింద సంబోదించారు. ఆ అమృతం ఎలాంటిదంటే తృప్తి చెంద‌నిది. దేవ‌లోకంలోకి వెళ్లాలంటే అమృతం తాగాల్సిందే. 43 ల‌క్ష‌ల ఏళ్ల‌యినా ఆ అమృతం త‌రిగి పోలేదు.

కోవెల‌లో ఈ పాట‌ల‌ను నాథ‌మునులు విని ఊరిలోని వారంద‌రిని ఈ పాట‌లు ఎవ‌రు రాశారు అని అడిగితే త‌మ‌కు తెలియ‌ద‌ని గ్రామ‌స్తులు తెలిపారు. పాట చివ‌ర్లో కురుగూర్ శ‌ఠ‌గోప‌న్ అని వ‌స్తుంది. అంటే అర్థం కురుగూర్ అనే ఊరులో శ‌ఠ‌గోప‌న్ అనే వారు ఈ పాట‌ను రాశారని అర్థ‌మ‌వుతుంది. అపుడు నాథ‌ముని కురుగూరుకు వెళ్లి శ‌ఠ‌గోప‌న్ ఎవ‌రు అని ఆరా తీస్తారు.

మూడు వేల ఏళ్ల కింద‌ట శ‌ఠ‌గోప‌న్ అనే వారు ఆ ఊరిలో నివ‌సించే వార‌ని, వారే ప్ర‌బంధాన్ని ర‌చించార‌ని తెలుసుకుంటారు. మ‌ళ్లీ అంద‌కుండా పోయిన ఆ పాట‌ల్ని తిరిగి ఈ లోకానికి ప‌రిచ‌యం చేయాల‌ని అక్క‌డి అర్చ‌కుని సూచ‌న‌తో 12 వేల సార్లు క‌ణ్ణినున్ శిరుత్తాంబు జ‌పం చేసి న‌మ్మాళ్వార్‌ను సాక్షాత్క‌రింప చేసుకుంటారు. నాథ‌మునుల‌కు ఆయ‌న ర‌చించిన ప్ర‌బంధంతో పాటు మిగ‌తా ఆళ్వార్లు ర‌చించిన 4 వేల పాట‌ల‌ను తెర వెనుక వుండి పాడ‌గా వీరు రాసుకున్నారు. త‌ద‌నంత‌రం శ్రీ రామానుజాచార్యులు ఈ పాట‌ల‌కు శిష్యుల‌చేత అర్థాలు, వ్యాఖ్యానాలు, తాత్ప‌ర్యాల‌ను రాయించారు. మొద‌టిది 6000 గ్రంధం తిరుక్కురుగై పిరాన్ పిళ్లాన్ రాశారు. రెండోది 9000, 12000, 24,000, 32000 , గ్రంధాల‌ను ఆచార్యులు అందించారు. 32000 గ్రంధాన్ని ఈడు వ్యాఖ్యానంగా వ‌డ‌క్కు తిరువీధి పిళ్లై అనే మ‌హానుభావులు అందించారు. ఈడు అంటే త‌గిన‌ది అని అర్థం. దీనిని భ‌గ‌వ‌త్ విష‌య‌మ‌ని అంటారు. విష‌యం అంటే స్థానం, ప్ర‌దేశం, ఇల్లు, స్థ‌లం అనే అర్థాలున్నాయి.

శ్రీ రామాయ‌ణం, శ్రీ‌మ‌ద్ భాగ‌వతం, ఉప‌నిషత్తులు, వేదాలు కూడా భ‌గ‌వ‌త్ విష‌యాలే. ఎందుకంటే వాటిలో భ‌గ‌వ‌త్ విష‌యం వుంది. అందులో ఇత‌ర విష‌యాలు కూడా ఉన్నాయి. కాని ఈడు వ్యాఖ్యానంలో భ‌గ‌వంతుడి గురించి త‌ప్ప వేరే విష‌యాలు లేవు. అందుకే దానిని భ‌గ‌వ‌త్ విష‌యం అంటారు.


Total Post Reads :


Related Posts
avatar