సింగపూర్లో జీయర్ స్వామి సమక్షంలో వైభవంగా శ్రీ యాగం మరియు సీతారామ కళ్యాణోత్సవం

శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి మంగళ శాసనములతో జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సింగపూర్ ఆధ్వర్యంలో సింగపూర్ లో విజయయాత్ర చేసిన చిన్న జీయర్ వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో పవిత్ర శ్రావణమాసంలో శ్రీ యాగం, లక్ష్మి పూజ, శ్రీ సీతారామ కళ్యాణం మొదలైన సేవలు ఈనెల 24 నుండి 26 వరకు మూడు రోజుల పాటు స్ధానిక శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయ ప్రాంగణంలో వైభవోతంగా జరిగాయి. గురువారం నాడు యాగ ప్రక్రియలో భాగంగా విష్వక్సేన, గరుడ, లక్ష్మి, సోమ లను నాలుగు మూల మండలంలలో మరియు ఇతర పరివారదేవతలను ఆవాహన చేశారు. శమి, అశ్వద్ధ వృక్ష కలపతో చేసిన ప్రత్యేక పరికరంతో , వేద మంత్రోత్సరణల మధ్య అగ్నిమథనం ద్వారా యాగమునకు కావసిన అగ్నిని రాజేసి యాగ హవనమునకు అంకురార్పణ చేశారు. జీయరు స్వామి యాగము, యాగ ముఖ్యోద్ధేశం గురించి, వర్తులం, చతురస్ర, ధనుస్సు మరియు త్రికోణ ఆకారాలతో ఉన్న యాగ కుండములు సామవేదం , ఋగ్వేదం, యజుర్వేదం,
అధర్వణ వేదాలకు ప్రతీకలని యాగప్రాంగణములో ఉన్న చక్రాబ్జ మండలం, దేవుని ప్రతిమలు, కుండములోని అగ్ని, కలశాలలోని జలం, వేదపండితులు ఉచ్ఛరించే మంత్రములు వరుసగా పంచభూతాలైన ఆకాశం, పృథ్వి, అగ్ని, నీరు మరియు వాయు రూపాలని తెలిపారు. సందర్భోచితంగా క్షీరసాగరమధనం, భాగవత, భారత, రామయణ ఇతివృత్తాంతాలను, యాగ ప్రయోజనాన్ని భక్తులకు తెలియజేశారు. మూడు రోజులలో ఐదు కాలాల్లో యాగము నిర్వహించి ప్రతి పూట పూర్ణాహుతి నిర్వహిస్తూ, శనివారం మహాపూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించిన వెంటనే పరదేవత సంతృప్తి చెందినట్లుగా వరుణదేవుని రూపంలో మిట్టమధ్యాహ్నం వేళ, వర్షపు ఛాయలేకున్నా ఎండలోనే క్షణంపాటు వర్షం కురిసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

మూడురోజులు వేద పండితులు వేదము, శ్రీ సూక్తము, పాశురములు, దివ్య ప్రబంధములు నిత్యపారాయణలు కూడా జరుపగా, జీయరు స్వామి దేవతా మూర్తులకు స్వహస్తాలతో విశేష పూజలు నిర్వహించి , మూల మంత్రమును భక్తులకు ఉపదేశించి జపాన్ని చేయుంచుట ద్వారా అనుగ్రహించడంతో పాటు తీర్ధగోష్ఠి నిర్వహించారు. భగవంతుని నామ జపాలతో పాటు విష్ణుసహస్రనామ పారాయణ కూడా నిర్వహించారు. శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున సాయంత్రం సుమారు 130 మంది ఔత్సాహిక మహిళలతో లక్ష్మిపూజ నిర్వహించారు. పూజలో పాల్గొన్న భక్తులకు లక్ష్మిదేవి ప్రతిమను అందించారు. అలాగే నిత్య పూజ ఎలా చేసుకోవాలో సులువుగా వివరించారు.

శనివారం సాయంత్రం శ్రీ సీతారామ కళ్యాణోత్సవాన్ని నిర్వహించగా, సుమారు 90 జంటలు పాల్గొని వారే స్వయంగా తమ స్వహస్తాలతో చూడ ముచ్చటగా స్వర్ణ వర్ణంలో ఉన్న పంచలోహమూర్తులకు కళ్యాణం జరిపించి వాటిని ఇంటికి తీసుకొనివెళ్ళేట్లుగా ఏర్పాట్లు చేసారు. దీనిలో భాగంగా రామ, కృష్ణ అవతార తత్వాలను సులువుగా వివరించటంతో పాటు, కళ్యాణోత్సవం లోని వివిధ అంకాలను విశదీకరించి భక్తులను అనుగ్రహించారు.

కొత్తగా ఏర్పాటైన శ్రీ జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సింగపూర్ లిమిటెడ్ (జెట్ సింగపూర్) కార్యవర్గాన్ని అందరికీ పరిచయం చేసి, వారి ఆశయాలను వివరించారు, కార్యవర్గానికి దిశానిర్ధేశం చేసి అందరూ వారికి సహకరించాలని కోరారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ యొక్క కార్యకలాపాలను స్ధూలంగా వివరించి, వారు నిర్వహించే వేద పాఠశాలలు, గోశాలలే కాకుండా అంధులకు నిర్వహిస్తున్న నేత్రవిద్యాలయ, గిరిజనబాలబాలికలకు నిర్వహిస్తున్న విద్యాకార్యక్రమాలను, మహిళా ఆరోగ్యవికాస్ ద్వారా సుమారు 26 లక్షల మంది మహిళలకు గర్భాసయ కాన్సర్ పరీక్షలను నిర్వహించామని తెలిపారు. ఇలాంటి విస్తృతమైన సేవలు మరిన్ని అందరికీ అందించడమే తమ ముఖ్య ఉద్ధేశ్యమన్నారు. తమ సంస్థకు చెందిన ముగ్గురు అంధ విద్యార్ధినులు భారతదేశపు అంధ మహిళా క్రికెట్ జట్టు తరుపున ఆడటంతో పాటు శనివారం రోజున ఇంగ్లండ్ లో ఆస్ట్రేలియ పై విజయం సాధించి ఐ బి యస్ ఎ క్రీడలలో స్వర్ణపతకాన్ని గెలిచి భారతకీర్తి పతాక ను ఎగరవేశారని భక్తుల కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు.

 

నిర్వాహకులు మాట్లాడుతూ, ఇది తమ మొట్టమొదటి కార్యక్రమం అని, అయినప్పటికి అందరి సహకారంతో ఈ పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించే అదృష్టం కలిగిందన్నారు. ఈ మూడురోజుల కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు మహాప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి సహకరించిన స్ధానిక పెరుమాళ్ దేవాలయం కార్యవర్గానికి, భక్తులకు, దాతలకు, స్వయం సేవకులకు జెట్ సింగపూర్ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. అందరూ తమకు సహకరించి తమ సంస్ధ అభివృద్దిలో సహకరించాలని కోరారు.

పూర్తి కార్యక్రమాన్ని క్రింది లింక్స్ ద్వారా వీక్షించవచ్చు.

24-Aug-23 9AM & 6PM

    • https://youtube.com/live/nmIUYx2OioI
    • https://youtube.com/live/zfE5F30TZrA

25-Aug-23 9AM & 6PM

    • https://youtube.com/live/CLuQtndFJH4
    • https://youtube.com/live/63gJ3BmYv1g

26-Aug-23 9AM & 6PM

  • https://youtube.com/live/qOLJ7K_-Lpo
  • https://youtube.com/live/I8Z7ER-eh7U