శ్రీ రామానుజాచార్యుల స‌హ‌స్రాబ్ది ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని ప‌లు చోట్ల భ‌క్తులు ప్ర‌త్యేక పూజ‌లు చేప‌ట్టారు. స్వామీజీ విశిష్ట‌త‌ను తెలియ చేస్తూ పుర‌వీధుల ద్వారా యాత్ర‌లు నిర్వ‌హించారు. ప్ర‌తి చోటా వికాస త‌రంగిణి ఆధ్వ‌ర్యంలో సుశిక్షుతులైన కార్య‌క‌ర్త‌లు, స‌భ్యులు ర్యాలీల‌ను విజ‌య‌వంతం చేయ‌డంలో స‌ఫ‌లీకృతుల‌య్యారు. కొన్ని చోట్ల సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టగా మ‌రికొన్ని చోట్ల క‌ళారూపాల‌ను ప్ర‌ద‌ర్శించారు. రాజాంలో వికాస త‌రంగిణి బాధ్యులు ర‌మ‌ణ‌మూర్తి ఆధ్వ‌ర్యంలో తాగునీటి సంర‌క్ష‌ణ తీసుకోవాల్సిన చ‌ర్య‌లు అనే అంశంపై  చిన్నారుల‌కు చిత్ర‌లేఖ‌నంలో పోటీలు నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి విద్యార్థుల నుండి పెద్ద ఎత్తున స్పంద‌న ల‌భించింది. ఎంద‌రో  చిన్నారులు త‌మ సృజ‌నాత్మ‌క‌త‌కు ప‌దును పెట్టారు. నీరే జీవ‌నాధారం..ప్ర‌కృతిని ఎలా కాపాడుకోవాలి..చెట్లు, మొక్క‌ల సంర‌క్ష‌ణ‌..ఇంకుడు గుంత‌ల ఏర్పాటు, నీటిని పొదుపుగా ఎలా వాడుకోవాలి..తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల గురించి పిల్ల‌లు చిత్రాలు గీశారు త‌మ ప్ర‌తిభ‌ను చాటుకున్నారు. ఎక్కువ మంది పిల్ల‌లు పాల్గొన‌డంతో అంద‌రూ త‌మ ఆలోచ‌న‌ల‌కు రంగులు అద్దారు. రంగుల హ‌రివిల్లుల‌ను సృష్టించారు. ఇంకొంద‌రు చిన్నారులు గీసిన చిత్రాలు భావాల‌కు ప్రాణం పోసేలా ఉన్నాయి. వీటిని చూసిన నిర్వాహ‌కులు ప్ర‌త్యేకంగా పాల్గొన్న వారిని అభినందించారు. చెట్ల‌ను తొల‌గించ‌వ‌ద్ద‌ని ..వాటిని కాపాడుకోవాల‌ని ..లేకపోతే భ‌విష్యత్‌లో నీటి కొర‌త ఎదుర్కొనే ప్ర‌మాదం ఉందంటూ ఓ చిన్నారి గీసిన చిత్రం ఎంత‌గానో  మెస్మ‌రైజ్ చేసింది. అనంత‌రం చిత్ర‌లేఖ‌నం పోటీల్లో పాల్గొన్న చిన్నారుల‌కు వికాస త‌రంగిణి త‌ర‌పున బ‌హుమ‌తుల‌తో పాటు ప్ర‌శంసా ప‌త్రాలు అంద‌జేశారు. అనంత‌రం శ్రీ రామానుజ మూల మంత్రాన్ని పఠించారు.