శ్రీమతి పద్మ రాళ్లపల్లి గారు, ఇంగ్లీష్ లెక్చరర్, విశాఖపట్నం నుండి. ఇది తెలుగు అనువాదం.
నా చిన్న తనంలో, మా అమ్మమ్మ నన్ను విజయవాడకు సమీపంలో ఉన్న ఒక గురువుల ఆశ్రమానికి తీసుకెళ్లింది. అక్కడ ఆవిడ నాకు ఒక యువ స్వామీజీని చూపించారు, వారు ఎవరో కాదు, పరమహంస పరివ్రాజకులు శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి వారు. వారు అప్పుడప్పుడే సన్యాసం స్వీకరించినట్టున్నారు. చూడగానే వీరు సాధారణమైన వారు కారని అనిపించింది. వారి నేత్రాలు దివ్య కాంతిని వెదజల్లుతున్నాయి.
నేను, నా 40వ ఏటలో పంచ సంస్కారం తీసుకున్నాను. అప్పటి నుండి, నాకు ఏ సందేహాలున్నా స్వామివారితో మానసికంగానే కనెక్ట్ అయి, సందేహాలు నివృత్తి చేసుకుంటాను.
కొన్ని సంవత్సరాల క్రితం నేను శరణాగతి దీక్ష చేస్తున్నాను. ముగింపు ఉత్సవం సమయంలో, నేను, నా భర్త మరియు నా కుమారుడు సిద్ధార్థ్‌తో కలిసి సీతానగరం వెళ్ళాము. ఆ సమయంలో భక్తులు మాట్లాడుకోవడం విన్నాను, గురువు లేదా ఆచార్యులు ఒక వ్యక్తి యొక్క కళ్లలోకి చూస్తే, వారి ఆశీర్వాదం అతని కళ్ళ ద్వారా గ్రహించబడుతుంది అని. నేను మా అబ్బాయి కోసం స్వామి వారిని ప్రార్థించాను. ఫంక్షన్ పూర్తయ్యాక తిరిగి వస్తున్నాం. అప్పుడు మా అబ్బాయి “అమ్మా.. స్వామి వారు నా కళ్లలోకి రెండు సార్లు అలా చూశారు. ఎందుకో తెలియదు” అన్నాడు. ఇది విని నేను షాక్ అయ్యాను. అంటే స్వామి వారు నా ప్రార్థనకు జవాబిచ్చారన్న మాట. తరువాత, మా అబ్బాయి తన జీవితంలో బాగా స్థిరపడ్డాడు. ఇప్పుడు డల్లాస్‌లో ఉంటున్నాడు.
మా కూతురు హేమశ్రీ విషయానికొస్తే, ఆ సమయంలో ఆమె ఫీనిక్స్‌లో ఉండేది. నేను ఒక రోజు తన గురించి ఆలోచిస్తూ, “స్వామీజీ దయచేసి నా కుమార్తెను ఆశీర్వదించండి.” అని ప్రార్థించాను. వెంటనే, మా కూతురి నుండి కాల్ వచ్చింది. ఆమె, “అమ్మా, స్వామీజీ ఇక్కడ ఫీనిక్స్‌లో ఉన్నారని తెలిసింది. కొంతమంది భక్తులు నాకు ఫోన్ చేసి, నేను వాలంటీర్‌గా సహాయం చేయగలవా అని అడిగారు.” నా చెవులను నేను నమ్మలేకపోయాను. అంటే స్వామి వారు నా ప్రార్థనలకు జవాబిచ్చారు. అలా అక్కడ సేవ చేసి, స్వామి వారిని కలుసుకుని ఆశీస్సులు అందుకుంది.
ఆధ్యాత్మిక అంశాల విషయానికొస్తే, స్వామి వారి ప్రవచనాల నుండి నాకు ఎల్లప్పుడూ స్పష్టత లభిస్తుంది. ఒకసారి నాకు, కలలు నిజమా కాదా అనే సందేహం వచ్చింది. వెంటనే, ఒక ప్రవచనంలో స్వామి వారు ఇలా చెప్పారు. “కలలు కూడా నిజమే. ఎక్కడో, ఎప్పుడో మనం చూసినవి, ఆలోచించినవి, కలల రూపంలో వస్తాయి” అని.
మరొకసారి, దేవుడు నిరాకారుడా లేక రూపంతో ఉంటాడా అనే సందేహం వచ్చింది. అప్పుడు స్వామి వారు మాట్లాడుతూ, భగవంతుడు నిరాకారుడు, ఎందుకంటే ఆయన సర్వవ్యాపి. ఆ విధంగా మనం ఆయనను రూపంతో చూడలేము. కానీ, మనం ఆయనను రూపంతో చూడాలనుకుంటే, రూపంలోనూ సాక్షాత్కరిస్తాడు విభవ, అర్చావతారాల్లో.
నేను స్కూల్స్‌లో, కాలేజీల్లో పని చేస్తున్నప్పుడు, నాకు పని భారం ఎక్కువ అని అనిపించినప్పుడల్లా, స్వామి వారు నా పక్కనే ఉండి నన్ను ఓదార్చినట్టు అనిపించేది మానసికంగా. అలాంటి సమయాల్లో వాహనాలపై “జై శ్రీమన్నారాయణ” అనే గుర్తొ, అలా ఎదో ఒక గుర్తు కనిపిస్తుంది. అలా స్వామి వారు నన్ను ఓదారుస్తున్నారని, స్వామి వారు నాతో మాట్లాడుతున్నారనే భావన కలిగి, నా వేదన నుంచి ఉపశమనం లభించేది.
ఆచార్యులు మనతో లేరని మనం ఎప్పుడు భావించనవసరం లేదు. వారు ఎల్లప్పుడూ మనతో ఉంటారు. వారిని మన మనసులో భావించినప్పుడు, వారి చిత్రాలను చూసినప్పుడు ఆచార్యుల ఉనికిని మనం స్పష్టంగా అనుభవించవచ్చు. వారు మన ప్రతి సందేహాన్ని తీరుస్తారనడంలో సందేహం లేదు. మనం చేయాల్సింది ఏమిటంటే, వారు చూపిన మార్గాన్ని అనుసరించడం.
ఇంకా ఇలాంటి చాలా అనుభవాలు ఉన్నాయి, వాటిని భవిష్యత్తులో మీతో పంచుకుంటాను.
జై శ్రీమన్నారాయణ!