అందమైన అనుభవాలు

అందమైన అనుభవాలు

బదరీ నారాయణ పెరుమాళ్ తిరునక్షత్ర శుభాకాంక్షలు!

గత జూన్‌లో, నేను, మా అమ్మాయి అమెరికా నుండి భారతదేశానికి వస్తున్నాము. మా ప్రయాణంలో హైదరాబాద్‌కు వెళ్లే మార్గంలో దోహాలో విమానం మార్పు చేయాల్సి ఉంది.
దోహాలో దిగిన తరువాత, గేట్ నెంబర్ కోసం అక్కడ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ స్క్రీన్ పైన చెక్ చేస్తున్నాము. మేము హైదరాబాద్ వెళ్లే షెడ్యూల్ సమయంలో ఉన్న విమానానికి గేట్ నెంబర్ చూపిస్తుంది కానీ, ఫ్లైట్ నంబర్ లేదు. కొద్ది సేపటి తరువాత మళ్ళీ చెక్ చేసాము, కానీ సమాచారం మారలేదు. సరే ఇంక ఆ స్క్రీన్ పై చూపించిన గేటు వద్దకు వెళ్లాము, లైన్ చాలా పొడవుగా ఉంది. కౌంటర్ వద్దకు చేరుకోగానే, అది మేము ఎక్కే ఫ్లైట్ కాదని, వేరే గేటు నుంచి ఇంకో ఇండిగో ఫ్లైట్ బయలుతేర్తుందని అక్కడున్న అటెండెంట్ తెలియచేసింది. ఆ వేరే గేటు చాలా దూరంలో ఉన్నందున మేము గేట్ వద్దకు చేరుకునే సమయానికి, అప్పటికే అది మూసివేయబడింది, ఫ్లైట్ టేకాఫ్ కోసం సిద్ధంగా ఉంది.

మాలాగే మరికొందరు ప్రయాణీకులు విమానాన్ని మిస్ అయ్యారు. హైదరాబాద్‌కు వెళ్లే తదుపరి విమానం రెండు రోజుల వరకు లేదు, పైగా ఒక్కొక్కరికి $300 అదనంగా పే చేయాల్సి ఉంటుంది. వేరే ఎయిర్లైన్స్ ఏవైనా హైదరాబాద్ కు అదే రోజు వెళ్తాయేమోనని చూస్తే ఏమి దొరకలేదు, సుదీర్ఘ ప్రయాణం అప్పటికే చాలా అలసిపోయి ఉన్నాం, అంతలో, ఢిల్లీకి వెళ్లే ఇండిగో ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ కొన్ని గంటల్లో ఉంది, అదనంగా ఏమి పే చేయక్కర్లేదు అని తెలిసింది. మా అమ్మాయి “అమ్మా.. మనం రెండు రోజులు ఇక్కడ వెయిట్ చేయలేము. ఢిల్లీకి వెళ్దాం” అని గట్టిగా చెప్పింది.

ఈ సంఘటనకు కొన్ని వారాల ముందు, నేను “శ్రీ స్వామి వారు బద్రికి వెళ్తున్నారు, మనం వెళదామా” అని మా అమ్మాయిని అడిగితే, నేను ఇది వరకు ఒక సారి వచ్చాను కదా, ఈ సారి కాకుండా వచ్చేసారి వస్తాను అని చెప్పింది. అలాగే అని ఊరుకున్నాను.

శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి వారు అదే సమయంలో అంధ విద్యార్థుల కోసం నిర్వహించబడిన ఒక VT సేవా కార్యక్రమంలో పాల్గొనడానికి ఢిల్లీకి వచ్చే ప్లాన్ ఉందని గుర్తుకు వచ్చింది. అక్కడి నుంచి స్వామి వారు హృషీకేశ్ మరియు బద్రీనాథ్ కి వెళ్లే ప్లాన్.

మనం ఎలాగూ ఢిల్లీ దాకా వెళ్తున్నాం కదా అక్కడి నుండి బద్రి వెళ్దామా, అంటే అలాగే అని చెప్పింది. అలా ఢిల్లీకి వెళ్లి, అక్కడ కార్యక్రమం హాజరై, అక్కడి నుండి హృషీకేశ్ వెళ్లి, ఇతర భక్తులతో బద్రీ నారాయణ్ దర్శనానికి బయలుదేరాము. తోటి భక్తులలో, ఫిలడెల్ఫియా నుండి తమ కుమార్తె సమాశ్రయణం కోసం బద్రీకి వచ్చిన ఒక కుటుంబాన్ని కలిసాము. వారిని చూస్తే చాలా సంతోషం వేసింది, బద్రిలో స్వామి వారితో సమాశ్రయణం పొందడం ఎంత అదృష్టం కదా అని అనుకున్నాను.

ఇంతలో అకస్మాత్తుగా మా అమ్మాయి “నాకూ సమాశ్రయణం దొరుకుతుందా?” అని అడిగింది. బద్రికి రావడానికి అంతగా ఆసక్తి చూపించనిది, ఇప్పుడు ఆకస్మాత్తుగా సమాశ్రయణం గురించి అడగడం చూసి నాకు ఆశ్చర్యం వేసింది.

భగవంతుని నామాల్లో ఒక నామం హృషీకేశ. అంటే అందరి ఇంద్రియాలను నియంత్రించేవాడు. అలాంటి హృషీకేశుడు తన మనసు మార్చడంలో సందేహం ఏముంది!

సరే, రేపటి వరకు జాగ్రత్తగా ఆలోచించుకొమ్మని చెప్పాను. అంతకుముందే చాలా సార్లు స్వామి వారి ప్రవచనాలు విన్నందు వలన తనకు పంచ సంస్కారం, దానిలో భాగంగా ఏమి ఆచరించాలి, ఏమి ఆచరించకూడదు ఇవన్నీ అప్పటికే బాగా తెలుసు. సమాశ్రయణం రోజు ఉదయం కొంచెం దిగులుగా కనిపించింది. కొన్ని సందర్భాల్లో స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళినప్పుడు, వారితో కలిసి భోజనం చేయడం కుదరదేమో అన్న ఆలోచన తనను ఇబ్బంది పెట్టసాగింది. నువ్వు బయట తినాల్సి వచ్చినప్పుడు, సాత్విక ఆహారాన్ని ఎంచుకుంటే ఫరవాలేదు అని చెప్పి. సమాశ్రయనానికి ముందు జరిగే స్వామి వారి ప్రవచనాన్ని విని, ఆ తర్వాత నిర్ణయం తీసుకొమ్మని చెప్పాను.

శ్రీ స్వామి వారు, వారి అనుగ్రహ భాషణంలో, సమాశ్రయణం యొక్క ప్రాముఖ్యతను మరియు దానితో సంబంధం ఉన్న ఆచరించవలిసినవి మరియు ఆచరించకూడని విషయాలను వివరించారు. స్వామి వారి మాటలు శ్రద్ధగా విన్న తరువాత వారి అనుగ్రహంతో, “నేను సమాశ్రయణం పొందుతాను” అని నమ్మకంగా చెప్పింది.

ఆ విధంగా, బదరీ నారాయణుని దివ్య సన్నిధిలో, అత్యంత పవిత్రమైన బదరీనాథ్‌లో ఆచార్యుల ద్వారా అత్యంత శక్తివంతమైన, పవిత్రమైన అష్టాక్షరీ మంత్రాన్ని పొందగలిగింది. నారాయణుడే స్వయంగా నరునికి అష్టాక్షరీ మంత్రాన్ని ప్రసాదించిన గొప్ప క్షేత్రం బదరీనాథ్. ఇప్పటికీ భగవంతుడు నర నారాయణ రూపంలో ఇక్కడ పర్వతాకారంలో ఉండి అష్టాక్షరీ నామ జపాన్ని చేస్తారని మన గ్రంధాలు చెప్తున్నాయి.

ఆచార్య అనుగ్రహం, పెరుమాళ్ సంకల్పం ఉంటే, మనకు కావాల్సినవి సునాయాసంగా మనకు అందేటట్లు చేస్తారు. అతడు తలుచుకుంటే ఏది సాధ్యం కాదు కనుక? అది విమానం మిస్ చేయించడం అయినా కావచ్చు… హైదరాబాద్ బదులు ఢిల్లీలో ల్యాండ్ చేయించడం అయినా కావచ్చు….

మనం చేయవలసిందల్లా శరణాగతి చేయడమే, భగవంతుడే ఆచార్యుల ద్వారా మనకు మార్గనిర్దేశం చేసి, సరైన మార్గంలో నడిచేలా చేస్తాడు.

ఆలా ఊహించని విధంగా మేము బదరి రావడం, అంతకంటే ఊహించని విధంగా మా అమ్మాయికి పునర్జన్మ, జ్ఞాన జన్మ ప్రసాదించడం, ఇది ఒక మరపు రాని దివ్య అనుభవం.

భగవంతుని లీలలు అద్భుతం… ఆశ్చర్యదాయకం…

జై శ్రీమన్నారాయణ!