అందమైన అనుభవాలు

అందమైన అనుభవాలు

జై శ్రీమన్నారాయణ! ఆధ్యాత్మిక పయనంలో అమెరికాలో నివసిస్తున్న ఒక భక్తుడి అనుభవాలు…

*****
భాగవతులకు దాసోహాలు!

చాలా సంవత్సరాల క్రితం, శ్రీ చిన్న జీయర్ స్వామి వారి నుండి సమాశ్రయణం స్వీకరించే భాగ్యం అడియేన్ కు లభించింది. అయితే, అప్పుడు తనకు రామానుజాచార్య పాద సంబంధము లభించినందున, ఇక మోక్షం లభిస్తుందని, తాను ఏమీ చేయనవసరం లేదని అనుకున్నాడు.

అయినప్పటికీ, అడియేన్ జీవితంలో ఒడిదుడుకులను, ఒత్తిడులను అనుభవిస్తూనే ఉన్నాడు. రామానుజాచార్య స్వామితో ఆధ్యాత్మిక సంబంధం ఉన్నప్పటికీ తాను ఆశించిన మానసిక శాంతి మరియు సంతృప్తిని ఎందుకు అనుభవించలేకపోతున్నాననే విషయం తనని ఆశ్చర్యపరిచింది.

ఈ ప్రశ్నలకు సమాధానాలు మరియు మార్గదర్శకత్వం కోసం అడియేన్ స్వామి వారిని మనసులో గట్టిగా ప్రార్థించసాగాడు. దానితో పాటు, మన సంప్రదాయం యొక్క సారాంశాన్ని గ్రహించడానికి స్వామి వారి ప్రవచనాలను జాగ్రత్తగా వినడం కూడా ప్రారంభించాడు.

అలా, అడియేన్ రెండు కీలక విషయాలను గ్రహించాడు:
1. మన ఆచార్యులు సాధారణ వ్యక్తి కాదు. మనల్ని కర్మ బంధం నుండి విముక్తి చేయడానికి, స్వయానా లక్ష్మీ దేవి పంపిన శ్రీమన్నారాయణుని యొక్క చరణ కమలములే. ఇది విశ్వసించిన వారు తప్పక ప్రయోజనం పొంది తీరుతారు.

2. ఆచార్యులతో మన సంబంధం పూర్తి శరణాగతి మరియు భక్తితో ఉండాలి, ఒక జడ వస్తువు మరియు దాని యజమాని మధ్య ఉన్న సంబంధం ఎలా ఉంటుందో అలా. ఇది మనకున్న అన్ని అడ్డంకులను తొలగిస్తుంది.
అష్టశ్లోకిలో నొక్కి చెప్పినట్లు ‘స్వామిత్వం, ప్రార్ధనాం చ, ప్రబలతరవిరోధి ప్రహాణం”

అడియేన్ ఈ సత్యాలను గ్రహించినప్పటికీ, కోరికలు, భవిష్యత్తు గురించిన ఆందోళనలు, ఆచార్యుల యొక్క బోధనలను సంపూర్ణంగా స్వీకరించడానికి, భగవద్ సాన్నిధ్యాన్ని పొందడానికి అడ్డుపడుతున్నాయి.

ఈ సారి ఆచార్యులపై పరిపూర్ణ విశ్వాసంతో ఆధ్యాత్మిక పురోగతికి మీరే మార్గనిర్దేశం చేయమని ప్రార్థించడమే కాకుండా, ఆచార్య ప్రవచనాలను వింటూ, ముఖ్యంగా “ది ట్రూత్” అనే వీడియోలో, స్వామి వారి జీవనశైలిని గమనించి, చాల ప్రభావితం చెంది, మూడు అంశాలను బలంగా అనుసరించడం ప్రారంభించాడు. ఇవే తన ఆధ్యాత్మిక ప్రయాణంలో అంచెలంచెలుగా పెరగడానికి దోహదపడ్డాయి.

1. ఆచార్యుల పట్ల ప్రగాఢమైన ప్రేమ మరియు భక్తిని పెంపొందించుకోవడానికి ఆయన అనుగ్రహాన్ని కోరుతూ భగవంతుణ్ణి చిత్తశుద్ధితో ప్రార్థించడం.
2. ఆహార నియమాలు పాటిస్తూ, ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం.
3. రోజు తీసుకొనే ఆహారపు అలవాట్లను నియంత్రించడం.

ఈ అభ్యాసాలు అడియేన్ ఆలోచనలు మరియు భావోద్వేగాలపై మెరుగైన నియంత్రణను పొందించడంలో ఎంతో దోహదపడ్డాయి. అలా ఆధ్యాత్మికంగా ఎదుగుతూ, తరువాత అష్టాక్షరీ అర్ధానుసంధానం నేర్చుకొనడం మరియు ఎప్పుడు సహాయం అవసరమైనా ఆచార్యులను మానసిక ఆశ్రయణం చేయడం నేర్చుకున్నాడు.

అడియేన్ వ్యక్తిగత అనుభవాలు మరియు అభ్యాసాలు కొందరికైనా ఉపయోగపడుతాయి అని ఆశిస్తున్నాను.
ఆచార్య తిరువడిగళే శరణం!
******
ఈ విధంగా ఆచార్య అనుగ్రహం, అభ్యాసంతో మన జీవనాన్ని సుఖమయం చేసుకోవచ్చు, ఇతరులకు ఆదర్శప్రాయంగా జీవితాన్ని గడపవచ్చు అనడానికి ఈ భక్తుని అనుభవమే నిదర్శనం! జై శ్రీమన్నారాయణ!